తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
ప్రతీ పెరిక బిడ్డ గర్వంతో తలెత్తుకునే సందర్భం ఇది
బావి తరాలకు ఢోకా లేని విధంగా సుసంపన్నం అవుతున్నాం
మరే కులానికి సాధ్యం కాని ఘనతలు సాధిస్తున్న శుభ తరుణం
ఏకకాలంలో దిగ్విజయంగా పది కార్యక్రమాలు
సంఘంలోని ఆరు కమిటీలు ఐకమత్యంతో సాధిస్తున్న ఘన విజయాలు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ పెరిక బిడ్డ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని మన రాష్ట్ర నాయకత్వం ఎంతో దార్శనికతతో చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి. రాష్ట్ర పెరిక సంఘంలోని ఆరు కమిటీల బాధ్యులు కలిసికట్టుగా మన కుల అభివృద్ధికి, సంక్షేమానికి పాటు పడుతున్నురు. తెలంగాణ రాష్ట్రంలోనే పెరిక కులాన్ని ఒక సుసంపన్న, స్వయం సమృద్ది కలిగిన కులంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికా బద్ధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఎవరి మీదా ఆధార పడకుండా మన పెరిక బిడ్డల భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకునే అద్భుత ప్రణాళికలతో ముందుకు పోతున్నారు. తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం, పెరిక కుల ఆత్మగౌరవ భవన కమిటీ, పెరిక కుల విద్యార్థి వసతి గృహం, పెరిక కుల సంక్షేమ సమితి, పెరిక కుల పరస్పర సహకార పరపతి సంఘం, పెరిక కుల వివాహ వేదిక... ఈ ఆరు కమిటీల నాయకులు ఒకరిపై ఒకరు సంపూర్ణ విశ్వాసంతో, పరస్పర సహకారంతో కలిసి కట్టుగా కార్యక్రమాలు నిర్వహించడం మన పెరిక కుల చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సిన అధ్యాయం. వీరి కృషి ఫలితంగా నేడు ఏకకాలంలో దాదాపు పది కార్యక్రమాలు విజయవంతంగా అమలు అవుతున్నాయి. వీటి ద్వారా పెరిక కులానికి కోట్లాది రూపాయల సంపద సమకూరింది. పెరిక బిడ్డలు మంచి వసతితో విద్యను అభ్యసించగలుతున్నారు. ఆపదలో ఉన్న పేదలకు తగిన సాయం అందుతున్నది.
తెలంగాణ రాష్ట్రంలో ఒక కుల సంఘంగా మనం సాధిస్తున్న విజయాలు ఇతర కులాల వారికి ఎవరికీ సాధ్యం కావట్లేదంటే మనం గర్వపడి తీరాల్సిన సందర్భం. ఒక్క సారి మన పురోగతి కోసం జరుగుతున్న కార్యక్రమాలను మనం తెలుసుకుందాం.
1. హైదరాబాద్ లోని కోకాపేటలో మనం రెండు ఎకరాల స్థలం సాధించుకోవడమే అతి పెద్ద విజయం. జనాభా పరంగా తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ జనాభా కలిగిన కులాలతో సమానంగా రెండు ఎకరాల స్థలాన్ని మనం సాధించుకోగలిగాం. దాని విలువ ఇప్పుడు మార్కెట్లో కనీసం 200 కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ స్థలంలో మనం ఇప్పుడు పెరిక కుల ఆత్మగౌరవ భవనం నిర్మించుకుంటున్నాం. ఇప్పటికే మొదటి స్లాబు పూర్తి అయింది. జూన్ నెలలో రెండో స్లాబు, జూలైలో మూడో స్లాబు వేసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి నేటి వరకు ఒక్క రూపాయి కూడ రాకున్నా, మొత్తం మన కుల సోదరులు అందించిన విరాళాలతోనే ఈ నిర్మాణాన్ని చేసుకుంటున్నాం. ఆత్మగౌరవ నిర్మాణ స్థలంలో బోరు వేసుకున్నాం. కరెంటు కనెక్షన్ కూడా మంజూరీ అయింది. చాలా తక్కువ సమయంలోనే, మిగతా కులాల కంటే చాలా ముందుగానే మనం కోకాపేటలో భవన నిర్మాణం పూర్త చేసుకుని ఆత్మగౌవర భావుటా ఎగుర వేయబోతున్నాం.
2. ఎంతో మంది సేవాతత్పరుల ఆలోచన, ముందు చూపు కారణంగా ఖైరతాబాద్ చౌరస్తాలో వెలిసిన పెరిక విద్యార్థి వసతి గృహం బహు విధాలుగా విస్తరిస్తున్నది. వేసవి సెలవులు ఉండడంతో ప్రస్తుతం ఖైరతాబాద్ హాస్టల్ ను పూర్తి స్థాయిలో ఆధునీకరించే పనులు జరుగుతున్నాయి. జూన్ మాసాంతం వరకు ఈ పనులు పూర్తయి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వసతి కల్పించే బాధ్యతను కమిటీ విజయవంతంగా పూర్తి చేస్తున్నది.
3. పెరిక కులస్తుల చిరకాల వాంఛ అయిన బాలికల హాస్టల్ నిర్మాణానికి బలంగా అడుగులు పడ్డాయి. ఎల్.బి. నగర్ మెట్రో స్టేషన్ కు అతి సమీపంలో 395 గజాల స్థలాన్ని కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. నెల రోజుల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి, నిర్మాణం ప్రారంభించాలనే దృఢ సంకల్పంతో మన నాయకులు శ్రమిస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి మన సొంత భవనంలోనే బాలికల హాస్టల్ నిర్వహణ జరుగుతుంది. ఈలోగా 2025-26 విద్యా సంవత్సరంలో కూడా బాలికల హాస్టల్ నడపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవసరం ఉన్న బాలికలు దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే హాస్టల్ కమిటీ కోరింది. ఎంత మంది బాలికలకు అవసరం ఉంటే, అంత మందికి హాస్టల్ వసతి కల్పించడానికి కమిటీ సిద్ధపడింది.
4. పెరిక విద్యార్థి వసతి గృహం ఆధ్వర్యంలో ఉప్పల్ లో నిర్మించిన భవనానికి సంబంధించిన పెండింగ్ పనులు కూడా పూర్తి కావడానికి రంగం సిద్ధమయింది. ఆ భవనాన్ని లీజుకు తీసుకున్న వారితో మన రాష్ట్ర నాయకులు చర్చించారు. పెండింగులో ఉన్న ఐదు నెలల కిరాయిని మన హాస్టల్ ఖాతాలో జమ చేయడం జరిగింది. ప్రతీ నెలా కిరాయి క్రమం తప్పకుండా వసూలు చేయడం జరుగుతున్నది. ఉప్పల్ భవనం లీజుకు తీసుకున్న వారితో చర్చించి పెంట్ హౌజు నిర్మాణానికి ఒప్పించడం జరిగింది. అతి త్వరలోనే ఉప్పల్ బిల్డింగులో పెంట్ హౌజు నిర్మాణం జరుగుతుంది.
5. పెరిక విద్యార్థులను అత్యున్నత పోటీ పరీక్షలకు సిద్ధం చేయడానికి 2025-26 విద్యా సంవత్సరం నుంచి ‘విద్యాజ్యోతి’ కార్యక్రమం నిర్వహించాలని మన కుల పెద్దలు నిర్ణయించారు. సివిల్స్, గ్రూప్స్ పరీక్షల్లో మెయిన్ కు క్వాలిఫై అయిన పేద పిల్లల ట్యూషన్ ఫీజులు చెల్లించడంతో పాటు, వారికి హైదరాబాద్ లో మంచి వసతి కల్పించి శిక్షణ ఇప్పించాలని నిర్ణయించడం జరిగింది. నీట్, ఐఐటి, ఐఐఎంలలో మెరిట్ సాధించిన పేద విద్యార్థుల ఫీజులను కూడా ‘విద్యాజ్యోతి’ కార్యక్రమం ద్వారా మన కుల సంఘమే చెల్లించాలని నిర్ణయించడం జరిగింది.
6. మన కులంలోని 20 మంది దాతలు ఎంతో మానవతా హృదయంతో తలా ఒక 5 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి పెరిక కుల సంక్షేమ సమితిని స్థాపించారు. ఇలా జమ అయిన డబ్బులను వడ్డీకి ఇవ్వడం ద్వారా వచ్చిన డబ్బులతో ప్రతీ నెలా క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆపదలో ఉన్న పేదలకు సాయం అందిస్తున్నారు.
7. పెరిక కుల పరపతి సంఘం దిగ్విజయంగా నడుస్తున్నది. 1333 మంది సభ్యులతో దాదాపు 4 కోట్ల టర్నోవర్ తో దాదాపు ఒక బ్యాంకు మాదిరిగా నడుస్తున్నది. పెళ్లిళ్లకు, చదువులకు, వైద్యానికి చాలా తక్కువ వడ్డీకి రుణ సాయం అందుకోవడం ఈ పరపతి సంఘం ద్వారా సాధ్యమవుతున్నది. గతంలో 2 లక్షల వరకున్న రుణ పరిమితిని ఇప్పుడు 3 లక్షల రూపాయలకు పెంచి ఇవ్వడం జరుగుతున్నది.
8. పెరిక కుల వివాహ వేదిక మన కులంలోని యువతీ యువకుల పెళ్లిళ్లకు సాయం అందిస్తున్నది. ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా మొత్తం వేదిక నిర్వహణ వ్యయమంతా మన కుల పెద్దలే భరిస్తున్నారు. ఇప్పటికి 26 సార్లు వివాహ వేదికలు నిర్వహించి దాదాపు 6,500 పెళ్లిల్లు కుదిరించడం జరిగింది. త్వరలోనే 27వ వివాహ వేదిక జరగబోతున్నది.
పై కార్యక్రమాలతో పాటు మన పెరిక కుల పెద్దలు శ్రీశైలం, యాదగిరిగుట్ట, భద్రాచలంలో నిర్మిస్తున్న పెరిక కుల సత్రాలకు ఇతోధికంగా సాయం అందిస్తున్నారు.
కులం అభివృద్ధికి, కులస్తుల సంక్షేమానికి ఎంతో ప్రణాళికా బద్ధంగా పనిచేస్తున్న మన కుల సంఘం రాష్ట్ర నాయకులకు, అన్ని కమిటీల బాధ్యులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఎవరి స్వార్థం వారు చూసుకునే ఈ రోజుల్లో మన పెరిక సంఘం నాయకులు తమ విలువైన సమయాన్ని, కష్టపడి సంపాదించుకున్న డబ్బులను కులం కోసం ఖర్చు చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. అన్నింటికంటే ముఖ్యంగా కులాన్ని ఒక్కతాటిపై నిలిపి, అన్ని కమిటీలు కలిసి కట్టుగా కులాభివృద్దే ధ్యేయంగా పనిచేస్తుండడం నిజంగా పెరిక కులం చేసుకున్న అదృష్టం.
జై పెరిక
జైజై పెరిక