తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
హైదరాబాద్ నగర నడిబొడ్డున, హుస్సేన్ సాగర్ తీరాన వెలిసిన, మన పెరిక విద్యార్థి వసతి గృహం, యావత్ పెరిక జాతి అస్తిత్వ పతాకంగా, రెపరెపలాడుతున్నది. పెరిక విద్యార్థి వసతి గృహం వార్షికోత్సవం, మనందరికీ ఓ పండుగ దినం. 50 సంవత్సరాల ప్రయాణాన్ని, విజయవంతంగా ముగించుకున్న మన పెరిక హాస్టల్, 51వ సంవత్సరంలోనికి అడుగు పెడుతుండడం మనందరికీ గర్వకారణం.
పెరిక విద్యార్థి వసతి గృహం స్వర్ణోత్సవ సంబురాలు జరుపుకునే సందర్భంలో మనమంతా మన ఘనమైన గతకీర్తిని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 50 సంవత్సరాలు మన హాస్టల్ నిరంతరాయంగా నడవడం ఓ గొప్ప చరిత్ర. పేదరికం కారణంగానో, సౌకర్యాలు లేని కారణంగానో, మారుమూల ప్రాంతాల్లో పుట్టిన కారణంగానో పెరిక జాతి బిడ్డల ఎదుగుదల ఆగవద్దనే గొప్ప సంకల్పంతో మన పూర్వీకులు ఆలయం లాంటి వసతి గృహం ఆలోచన చేశారు. పెరిక జాతి బిడ్డలు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఆలంబనగా ఉండడం కోసం 12 మంది స్థాపక ధర్మకర్తలు ఎంతో ముందుచూపుతో ఈ హాస్టల్ ను స్థాపించారు.
పత్తిపాక బాలరాజయ్య గారు, కావేటి రంగయ్య గారు, మారిశెట్టి నారాయణ గారు, గోపతి శ్రీరాములు గారు, అచ్చ బాలరాజయ్య గారు, ఎడ్మ నర్సింగ్ రావు గారు, పెట్రిం కుప్పుస్వామి గారు, రామినేని బాలకిష్టయ్య గారు, బెడిద రాజమౌళి గారు, కర్రె మల్లయ్య గారు, కానుగంటి లక్స్మినర్సయ్య గారు, కామిశెట్టి అంజయ్య గారు. ఈ పన్నెండు మంది మొదట పూనుకుని 1972లోనే పెరిక విద్యార్థి వసతి గృహం ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే ఖైరతాబాద్ లో నవాబుల భవనాన్ని రెండు లక్షల 15వేల రూపాయలకు కొనుగోలు చేశారు.
ఆ మహనీయుల కృషి ఫలితంగా 1975 ఫిబ్రవరి 2న హాస్టల్ ప్రారంభం అయింది. ఇదే హాస్టల్ నేడు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించుకుంటున్నది. ఈ హాస్టల్ కు ఎంతో సేవానిరతితో, దార్శనికతతో అంకురార్పణ చేసిన ఆ 12 మంది పెద్దలను మనస్ఫూర్తిగా స్మరించుకోవాల్సిన తరుణం ఇది. వారి స్ఫూర్తితోనే ఈ హాస్టల్ ను మరింత గొప్పగా తీర్చిదిద్దే సంకల్పం తీసుకోవాల్సిన సందర్భం ఇది.
2000 సంవత్సరం వరకు పాత భవనంలోనే మన పెరిక విద్యార్థి వసతి గృహం నడిచింది. నాడు హైదరాబాద్ నగరంలో చాలా కొద్ది కులాలకు మాత్రమే హాస్టల్ ఉండేది. ఆర్థికంగా పెద్దగా ఎదిగిన కులం కాకపోయినప్పటికీ, మన పెరిక కుల పెద్దల సేవానిరతి, దాన గుణం వల్ల మాత్రమే నాడు ఈ హాస్టల్ ప్రారంభించుకోగలగడం పెరిక జాతి చరిత్రలో గొప్ప మైలురాయిగా నిలిచింది. పెరిక జాతి అస్తిత్వానికి నాటి నుంచి నేటి వరకు ఈ హాస్టల్ ఓ శిఖర స్తంభంగా నిటారుగా నిలబడింది. 12 మంది స్థాపక ధర్మకర్తలు 1972లోనే మొదట ఒక్కొక్కరు 2,116 రూపాయలు చందాలు వేసుకోవడంతో పాటు, తర్వాత మరికొద్ది మంది ధర్మదాతలు వారికి జమ అయి మరికొన్ని నిధులు సమకూర్చారు. ఆ తర్వాత క్రమం తప్పకండా అనేక మంది ధర్మకర్తలు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు.
పెరిక విద్యార్థి వసతి గృహంలో ధర్మకర్తల సంఖ్య గరిష్టంగా1000 మంది అని గతంలో నిర్ణయించడం జరిగింది. ఇప్పుడా సంఖ్యను 1200కు పెంచాలని నిర్ణయించాం. ధర్మకర్తలు అందించిన ఆర్థిక సహకారం వల్లనే ఇన్నేళ్లుగా విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యం కల్పంచడం జరుగుతుంది. స్థాపక ధర్మకర్తలు ఈ వసతి గృహానికి పునాది రాళ్లు అయితే, ధర్మకర్తలంతా మూల స్తంభాల్లా నిలబడి యావత్ పెరిక జాతి ఔన్నత్యాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయారు. స్థాపక ధర్మకర్తలకు, రెండు లక్షల రూపాయల విరాళం ఇచ్చిన మహాదాత చింతకుంట్ల శ్యాంకిరణ్ గారికి, భవన నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన ధర్మదాతలకు, వడ్డీ లేకుండా డబ్బులు సమకూర్చిన 39 మంది పెద్దలకు, అందరు ధర్మకర్తలకు ఈ స్వర్ణోత్సవ వేళ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము.
1975లో ప్రారంభమయిన ఈ హాస్టల్ దినదినం అభివృద్ది చెందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ఎంతో మంది విద్యార్థులు హైదరాబాద్ వచ్చి చదువుకోవడానికి ఈ హాస్టల్ గొడుగులా నీడ అయింది. అమ్మలా అక్కున చేర్చుకుని అన్నం పెట్టింది. వారి ఎదుగుదలకు నిచ్చెన మెట్ల మాదిరిగా ఉపయోగపడింది. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 2000 సంవత్సరంలో కొత్త భవనం నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. 2008లో కొత్త భననం పూర్తయింది. రోడ్డు వెడల్పు కార్యక్రమాల్లో మనం కొంత జాగా కోల్పోయినప్పటకీ, ఇంకా మన పెరిక విద్యార్థి వసతి గృహం ఖైరతాబాద్ చౌరస్తాలో చాలా ఠీవీగా, చాలా ధీమాగా మన ఆత్మగౌరవాన్ని చాటుతున్నది.
పెరిక విద్యార్థి వసతి గృహం స్థాపించిన ధర్మకర్తల ఆశయాలను సాధించడం కోసం నాటి నుంచి నేటి వరకు పాలకవర్గ బాధ్యతలు స్వీకరించిన వారు నిస్వార్థ సేవలు అందించారు. తమ విలువైన సమయాన్ని కేటాయించి, పిల్లలకు మంచి సౌకర్యాలు కల్పిచండానికి, వనరులను సరిగ్గా వినియోగించడానికి కృషి చేశారు. వారందరికీ మనస్ఫూర్తిగా యావత్ పెరిక జాతి తరుఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
ఇప్పటి వరకు ఈ హాస్టల్లో వేలాది మంది విద్యార్థులు ఆశ్రయం పొందారు. రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపార, సామాజిక రంగాల్లో మన పెరిక బిడ్డలు ఎదగడానికి ఈ హాస్టల్ ఉపయోగపడింది. ప్రభుత్వ మాజీ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్థన్ గారి లాంటి వారు ఎంతో మంది ఈ హాస్టల్ లో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించడం మనందరికీ స్ఫూర్తిదాయకం. పెరిక విద్యార్థి వసతి గృహం విద్యార్థులకు వసతి కల్పించే ప్రధాన భాధ్యతలతో పాటు, మన పెరిక జాతి అభివృద్ధి, సంక్షేమానికి కూడా వేదికగా నిలుస్తుండడం మనందరికీ గర్వకారణం. ఇదే ప్రాంగణంలో మన పెరిక కుల అభివృద్ధికి ప్రణాళికలు రచించబడి, అమలు అవుతుండడం మనకు సంతోషకరం.
ఈ పెరిక విద్యార్థి వసతి గృహం కింది అంతస్తులను కిరాయికి ఇవ్వడం ద్వారా మనకు ఆదాయం కూడా సమకూరుతున్నది. ఇలా సమకూరిన ఆదాయంతో మనం ఉప్పల్ లో 2012 సంవత్సరంలో 968 గజాల స్థలం కొనుగోలు చేశాము. అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించుకోగలిగాం. ఆ భవనాన్ని కిరాయికి ఇవ్వడం ద్వారా మన హాస్టల్ కు ప్రతీ నెలా ఆదాయం సమకూరుతున్నది. ఇలా విభిన్న మార్గాల ద్వారా సమకూరిన ఆదాయంతో మన పెరిక విద్యార్థి వసతి గృహం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముందుకు పోతున్నదనే విషయాన్ని సగర్వంగా ప్రకటిస్తున్నాము. ప్రస్తుతం మన పెరిక విద్యార్థి వసతి గృహానికి ఖైరతాబాద్, ఉప్పల్ లో స్వంత భవనాలున్నాయి. బ్యాంకులో 12,96,749 రూపాయల నిల్వ ఉంది. కోటక్ బ్యాంకులో రెండు కోట్ల 58 వేల 923 రూపాయలు, ఎస్బీఐలో 50 లక్షల రూపాయల ఫిక్సుడ్ డిపాజిట్లు ఉన్నాయి. ప్రతీ నెలా ఏడు లక్షల 67వేల 773 రూపాయల ఆదాయం సమకూరుతున్నది.
పెరిగిన ఆదాయాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించి మన పెరిక బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని మేము చాలా చిత్తశుద్దితో ప్రయత్నాలు చేస్తున్నామనే విషయాన్ని మీతో పంచుకుంటున్నాము.
ఎల్.బి.నగర్ ప్రాంతంలో మరో భవనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుతున్నాయి. అప్పుడు ఒక భవనంలో బాలికల హాస్టల్, మరో భవనంలో బాలుర హాస్టల్ నిర్వహించడానికి వీలవుతుంది. బాలికల హాస్టల్ ను 2025-26 విద్యా సంవత్సరం నుంచే నడపాలని మా కార్యవర్గం కృతనిశ్చయంతో ఉంది. మనకు సొంత భవనం సమకూరే వరకు అవసరమైతే అద్దె భవనంలో కానీ, ఇతర మార్గాల ద్వారా గానీ ఈ ఏడాది నుంచే బాలికల కోసం హాస్టల్ నిర్వహించడానికి ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియ చేస్తున్నాము.
ప్రస్తుత హాస్టల్ నిర్వహణతో పాటు ఎల్.బి.నగర్ ప్రాంతంలో బాలికల హాస్టల్ నిర్మాణం కోసం స్థలం తీసుకోవడం జరిగింది.