తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
కోకాపేటలో పెరిక కులానికి రెండు ఎకరాలు
స్థలం సాధించడం వెనుక ఓ విజయ గాథ
కేసీఆర్ పిఆర్ఓగా పనిచేసిన గటిక విజయ్ కుమార్ కృషి
ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ గారి కృషితో పెరిక సంఘం పేర స్థలం
పెరిక కుల పెద్దలు ఐక్యతగా నిలిచి సాధించిన అద్బుతం
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని అత్యంత విలువైన నియో పొలిస్ హెచ్ఎండిఏ లే అవుట్ లో తెలంగాణ రాష్ట్ర పెరిక కులం (766/2014) రెండు ఎకరాల స్థలం సంపాదించగలిగింది. అందులో విజయవంతంగా పెరిక కుల ఆత్మగౌరవ భవనం నిర్మించుకోవడం సాధ్యమవుతున్నది.
నేపథ్యం :
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, వారి మంత్రివర్గం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బిసి కులాలకు హైదరాబాద్ నగరంలో ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి వీలుగా స్థలం, నిధులు కేటాయించాలని నిర్ణయించారు. దాని ప్రకారమే 41 కులాలకు ఆయా కులాల జనాభాను అనుసరించి స్థలం కేటాయించాలని నిర్ణయించారు. బిసి కులాల ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి కోకాపేట, ఉప్పల్ భగాయత్ లో స్థలాలను గుర్తించారు.
మొదట కేటాయించింది ఒక ఎకరం.. అదీ ఉప్పల్ భగాయత్ లో...
జనాభా ఎక్కువున్న ముదిరాజ్, మున్నూరు కాపు, గౌడ, యాదవ, కురుమ, పద్మశాలి తదితర కులాలకు కోకాపేటలో, జనాభా తక్కువ కలిగిన కులాలకు ఉప్పల్ భగాయత్ లో స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమగ్ర కుటుంబ సర్వేలో పెరిక కుల జనాభా మొత్తం 2,10,580 గా నిర్థారణ అయింది. ఇందులో పెరిక కులం కింద 2,05,303, పెరిక బలిజ కింద 3,153, పురగిరి క్షత్రియ కింద 1,124 మంది ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. దీని ప్రకారం పెరిక కులానికి ఒక ఎకరం స్థలం ఉప్పల్ భగాయత్ లో కేటాయించాలని, ఆత్మగౌరవ భవనం నిర్మించుకోవడానికి ఒక కోటి రూపాయలను విడుదల చేయాలని నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది.
గటిక విజయ్ కుమార్ గారి చొరవతో సాధ్యమైన రెండు ఎకరాలు
పెరిక కులానికి కేటాయించిన ఒక ఎకరం స్థలం, ఒక కోటి రూపాయల నిధులు కాస్తా రెండు ఎకరాల స్థలం, రెండు కోట్ల రూపాయల నిధులకు పెరగడానికి పెద్ద కథే నడిచింది. ఏ కులానికి ఎంత స్థలం, ఎక్కడ కేటాయించాలో నిర్ణయించడానికి ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీ నియమించింది. నాటి బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజెందర్, అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి గార్లతో ఈ కమిటీ ఏర్పాటు జరిగింది. ఈ కమిటీ అన్ని కులాలతో సమావేశం నిర్ణయించి, ఆయా కులాలకు ఎంత స్థలం, ఎక్కడ కేటాయించాలో నిర్ణయించింది. ఈ సమయంలో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పిఆర్ఓగా పనిచేస్తున్న ప్రముఖ జర్నలిస్టు గటిక విజయ్ కుమార్ జోక్యం చేసుకున్నారు. నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్లి తమ కులానికి రెండు ఎకరాల స్థలం కావాలని, అది కూడా కోకాపేటలో కావాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని ముగ్గురు సభ్యుల కమిటీకి తెలిపారు. దీంతో గటిక విజయ్ కుమార్ తో పాటు, నాడు తెలంగాణ రాష్ర్ట్ పెరిక కుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న మద్దా లింగయ్య గారు ముగ్గురు సభ్యుల కమిటీని కలిశారు. పెరిక కులానికి రెండు ఎకరాలు కేటాయించాల్సిందేనని గటిక విజయ్ కుమార్ వత్తిడి తెచ్చారు. దీంతో ముగ్గురు సభ్యుల కమిటీ పెరిక కులానికి రెండు ఎకరాల స్థలం, రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించడానికి అంగీకరించింది. ఈ ప్రయత్నం ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘానికి అత్యంత విలువైన రెండు ఎకరాల స్థలం సమకూరింది.
గంప గోవర్థన్ గారి చొరవతో సంఘం పేర స్థలం
ప్రభుత్వం వివిధ కులాలకు స్థలం కేటాయించాలని నిర్ణయించింది. అయితే ఒక్కో బిసి కులానికి అనేక సంఘాలు ఉండడంతో ఎవరి పేర స్థలం ఇవ్వాలనే విషయంలో చాలా గందరగోళం నెలకొంది. 2021 నవంబర్ 8న నాటి బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు అన్ని కుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కులమంతా ఒకే సంఘంగా లేదా ఒకే ట్రస్టుగా ఏర్పడితేనే స్థలం ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పెరిక కులానికి ఒకే ఒక్క రిజిస్టర్డ్ (766/2014) సంఘం ఉందని, మరో సంఘం లేదని కుల పెద్దలు ప్రభుత్వానికి చెప్పారు. ఈ సందర్భంలో నాటి ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్థన్ గారు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం పేరిటే స్థలం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం 2022 జూలై 7న పెరిక కుల సంఘానికి రెండు ఎకరాల స్థలం, రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ జీవో (మెమో నం.బి/4235/2016-17) విడుదల చేసింది. అలా తెలంగాణ పెరిక కులానికి రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట హెచ్ఎండిఏ లే అవుట్ లో సర్వే నెంబరు 240లో గల 14వ నెంబరు ప్లాటులో పెరిక కులానికి స్థలం దక్కింది.
గటిక విజయ్ కుమార్ అధ్యక్షతన భవన నిర్మాణ కమిటీ
ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి, అత్యంత విలువైన స్థలం సంపాదించుకున్న తర్వాత రాష్ట్ర పెరిక సంఘం క్షణం ఆలస్యం చేయవద్దని నిర్ణయించుకుంది. కులానికి కేటాయించిన స్థలాన్ని కాపాడుకోవాలంటే భవన నిర్మాణం చేయాల్సిందేనని తీర్మానం చేసుకుంది. నాగోల్ లోని జూబ్లీ పార్కు హోటల్ లో కుల పెద్దలతో సమావేశం నిర్ణయించింది. కుల పెద్దల వద్ద నుంచి చందాలు వసూలు చేసి, ఆత్మగౌరవ భవనం నిర్మించుకోవాలని నిర్ణయించింది. భవన నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని మద్దా లింగయ్య అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెరిక సంఘం నిర్ణయించింది. ఖైరతాబాద్ పెరిక భవన్ లో సమావేశమైన రాష్ట్ర పెరిక సంఘం కార్యవర్గం గటిక విజయ్ కుమార్ చైర్మన్ గా పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే భవన నిర్మాణం జరగాలని తీర్మానించింది.
అంగరంగ వైభవంగా శంకుస్థాపన కార్యక్రమం
కోకాపేటలో త్వరితగతిన పెరిక కుల ఆత్మగౌరవ భవనం నిర్మించాలనే తలంపుతో అంగరంగ వైభవంగా 2023 ఆగస్టు 27న శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ విప్ గంపా గోవర్థన్ అధ్యక్షతన రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ప్రభుత్వ చీఫ్ విఫ్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు శ్రీరాం భద్రయ్య, బండి పుల్లయ్య, మాజీ జడ్పీ చైర్మన్ చుంచు ఊశన్న, రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షులు దాసరి మల్లేశం, శ్రీరాం దయానంద్, పెరిక హాస్టల్ మాజీ అధ్యక్షులు బొలిశెట్టి వీరయ్య, పాయల జంగయ్య, హాస్టల్ అధ్యక్షుడు అంగిరేకుల నాగార్జున తదితరుల సమక్షంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 8 వేల మంది పెరిక కులస్తుల సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమం, సభ జరిగింది.
శరవేగంగా నిర్మాణ పనులు
శంకుస్థాపన జరిగే స్థలాన్ని అంతకుముందే చదును చేసి, డిజిటల్ సర్వే చేయడం కూడా జరిగింది. పెరిక కుల పెద్దల నుంచి అందిన విరాళాల ద్వారానే నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. నిర్మాణ పనులు చేపట్టడం కోసం టెండర్లు పిలవడం జరిగింది. రవి అనే కాంట్రాక్టర్ కు పని అప్పగిస్తూ 2024 డిసెంబర్ లో అగ్రిమెంటు చేసుకోవడ జరిగింది. డిసెంబర్ 2025 నాటికి రెండు స్లాబులు పూర్తి చేసి, మూడో స్లాబు వేయడానికి రంగం సిద్ధం అయింది.
ఎప్పటికప్పుడు అధికారులకు ప్రగతి నివేదికలు
కోకాపేటలో నిర్మించే పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు బిసి సంక్షేమ శాఖకు, ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న నోడల్ విభాగం ఇఇ టిజిఇడబ్ల్యుఐడిసి వారికి నివేదికలు, డిజైన్లు సమర్పించడం జరిగింది. 2023 ఆగస్టు 31న పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను బిసి కమిషనర్, ఇఇ టిజిఇడబ్ల్యుఐడిసి గారికి సమర్పించడం జరిగింది. బిసి కమిషనర్ గారు పెరిక భవనం డిజైన్లను ఆమోదిస్తూ సదరు ఫైలును బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి గారికి 2024 నవంబర్ 2న పంపడం జరిగింది. భవనం పురోగతిని వివరంగా తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం తరుఫున కమిషనర్, బిసి సంక్షేమ శాఖ మరియు ఇఇ టిజిఇడబ్ల్యుఐడిసి గార్లకు 2025 ఫిబ్రవరి 10న నివేదిక సమర్పించడం జరిగింది.
ఆత్మగౌరవ భవన నిర్మాణంలో ముఖ్య ఘట్టాలు
- 2021 నవంబర్ 8 : బిసి కులాల ప్రతినిథులతో బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమావేశం.
- 2022 ఏప్రిల్ 21 : ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం అనుసరించాల్సిన మార్గదర్శకాలను (NO.B/4235/2018-1) విడుదల చేసిన ప్రభుత్వం.
- 2022 జూలై 7 : పెరిక కుల సంఘం (766/2014) ఆత్మగౌరవ భవన నిర్మాణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల స్థలం, రెండు కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు (మెమో నం.బి/4235/2016-17) జారీ చేసింది.
- 2023 ఏప్రిల్ 7 : నాగోల్ లోని జూబిలీపార్కులో పెరిక సంఘం సమావేశం. కోకాపేటలో భవన నిర్మాణం చందాలతో నిర్మించాలని తీర్మానం.
- 2023 జూలై 2 : గటిక విజయ్ కుమార్ చైర్మన్ గా, చుంచు ఊశన్న వైస్ చైర్మన్ గా, కుంచాల బాలరాజు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా, అచ్చ రఘు కుమార్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా భవన నిర్మాణ కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పెరిక సంఘం తీర్మానం.
- 2023 ఆగస్టు 7 : పెరిక కుల సంఘం తన భవనాన్ని తానే నిర్మించుకుంటుందని బిసి సంక్షేమ శాఖ కమిషనర్ గారికి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లేఖ అందివ్వడం జరిగింది.
- 2023 ఆగస్టు 13 : కరీంనగర్ లో జరిగిన పెరిక కుల సంఘం సమావేశంలో బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు పాల్గొన్నారు. పెరిక కుల ఆత్మగౌరవ భవనం కోసం కేటాయించిన రెండు కోట్లను 5 కోట్లకు పెంచుతామని హామీ ఇచ్చారు.
- 2023 జూలై 18 : కోకాపేట స్థలంలో భూమిని చదును చేసి, డిజిటల్ సర్వే చేసి, హద్దు రాళ్లు పాతడం జరిగింది.
- 2023 ఆగస్టు 27 : కోకాపేటలో పెరిక కుల ఆత్మగౌరవ భవనం నిర్మాణానికి శంకుస్థాపన.
- 2023 ఆగస్టు 31: పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను బిసి కమిషనర్, ఇఇ టిజిఇడబ్ల్యుఐడిసి గారికి సమర్పించడం జరిగింది.
- 2024 జనవరి 18 : బోర్ వేయడం జరిగింది.
- 2024 నవంబర్ 2 : పెరిక భవనం డిజైన్లను ఆమోదిస్తూ సదరు ఫైలును బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి గారికి బిసి సంక్షేమ శాఖ కమిషనర్ లేఖ రాయడం జరిగింది.
- 2024 డిసెంబర్ 20 : భవన నిర్మాణం కోసం రవి (కాంట్రాక్టర్)తో అగ్రిమెంటు
- 2025 ఫిబ్రవరి 5 : పెరిక భవన్ నిర్మాణానికి కావాల్సిన స్ట్రక్చరల్ సర్టిఫికెట్ ను లక్ష్య సర్వీసెస్ ఇంజనీరింగ్ విభాగం అందించడం జరిగింది.
- 2025 ఫిబ్రవరి 10 : కమిషనర్, బిసి సంక్షేమ శాఖ మరియు ఇఇ టిజిఇడబ్ల్యుఐడిసి గార్లకు ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులకు సంబంధించిన నివేదిక సమర్పించడం జరిగింది.
- 2025 మే 17 : మొదటి స్లాబ్ పడింది.
- 2025 మే 20 : పెరిక కుల ఆత్మగౌరవ భవనానికి విద్యుత్ కనెక్షన్ ఇస్తూ ఎస్.పి.డి.సి.ఎల్. ఉత్తర్వులు
- 2025 అక్టోబర్ 10 : రెండవ స్లాబ్ పడింది.
- 2025 అక్టోబర్ 12 : పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గటిక విజయ్ కుమార్ ఎన్నిక కావడంతో, భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గా సుందరి వీరభాస్కర్ నియామకం జరిగింది.
- 2026 జవనరి 10 : మూడవ స్లాబ్ పడింది.
2025 ఆగస్టు 6న కోకాపేట పెరిక భవన్ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర సంఘం, భవన నిర్మాణ కమిటీ ముఖ్యలు
రెండో స్లాబ్ పనులను త్వరలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచన
కోకాపేట పెరిక భవన్ నిర్మాణ పనులు త్వరితగతిన నడుస్తున్నాయని,రాష్ట్ర కుల బంధువులందరూ విరాళాలకు ముందుకు రావాలని, నిర్మాణానికి సహకారం అందచేయాలని రాష్ట్ర సంఘం అధ్యక్షులు మద్దా లింగయ్య, నిర్మాణ కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్ కోరారు.
పనులను పరిశీలన చేసిన వారిలో నిర్మాణ కమిటీ కో-చైర్మన్ చుంచు ఉషన్న, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్, రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరి వీరబాస్కర్,విద్యార్థి వసతి గృహం కార్యనిర్వాహక కార్యదర్శి అంకతి విజయ్ కుమార్, రాష్ట్ర నాయకులు దొంగరి శంకర్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్ బాబు.
కోకాపెట లో పెరిక కుల ఆత్మ గౌరవ భవన నిర్మాణ పనులను 2025 మార్చి 8న భవన కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్, వైస్ చైర్మన్ చుంచు ఉషన్న, సీనియర్ ఇంజనీర్ గోపు హిమెష్ పర్యవేక్షించారు.
కోకాపేట భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండగా, ఏడు అంతస్తులకు సరిపోయేలా వేసిన ఫౌండేషన్ నాణ్యతను ఈరోజు పరిశీలించారు.
కాంట్రాక్టర్ రవికి కొన్ని సూచనలు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటే మొదటి అంతస్తు నిర్మాణం కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలని కాంట్రాక్టర్కు తెలిపారు.
మార్చ్ నెలాఖరు లోగా గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వేయాలని సూచించారు.
కోకపేట :
హైదరాబాద్ లోని కోకాపేటలో పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులు రాష్ట్ర పెరిక సంఘం ఆధ్వర్యంలో 2024 డిసెంబర్ 22న ఉదయం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల స్థలంలో ఆరు అంతస్తుల భవనం నిర్మించుకోవడానికి అనువైన ఫుట్టింగ్సుతో పని ప్రారంభం అయింది. తొలి దశలో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి నిధులు రావడం ఆలస్యం అవుతుండడంతో మొదటి దశ నిర్మాణాన్ని పెరిక కుల పెద్దలు ఇచ్చిన విరాళాలతో పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది.
పనుల ప్రారంభ కార్యక్రమానికి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెరిక విద్యార్థి వసతి గృహం ధర్మకర్త ఎడ్మ నర్సింగరావు గారు మొదటి కొబ్బరికాయ కొట్టగా, కుల పెద్ద కామిశెట్టి నర్సింగరావు గారు పూజా కార్యక్రమం నిర్వహించారు. పెరిక హాస్టల్ మాజీ అధ్యక్షుడు దాసరి మల్లేశం గారు, పెరిక సంఘం వ్యవస్థాపక కార్యదర్శి పాయిల జంగయ్య గారు, రాష్ట్ర సంఘం ప్రత్యేక ఆహ్వానితులు శ్రీరాం విజయపాల్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
పెరిక కుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీరాం భద్రయ్య, రాష్ట్ర అధ్యక్షుడు మద్దా లింగయ్య, ఆత్మ గౌరవ భవన కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్ ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
పెరిక సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, కోశాధికారి దొంగరి మనోహర్, అధికార ప్రతినిథులు బత్తిని పరమేశ్ (హైదరాబాద్ అధ్యక్షుడు), సుందరి వీర భాస్కర్ (ఎల్బీ నగర్ అధ్యక్షుడు), భవన నిర్మాణ కమిటి వైస్ చైర్మన్ చుంచు ఊశన్న, ప్రధాన కార్యదర్శి కుంచాల శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అచ్చ రఘు కుమార్, భవన నిర్మాణ కమిటీ సభ్యులు బోడపుంటి ప్రకాశ్, అంకతి విజయ్ కుమార్, దొంగరి శంకర్, దాచెపల్లి రవి, పెరిక హాస్టల్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి దిడ్డి సురేష్, పెరిక సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి ప్రకాశ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బొలిశెట్టి సతీశ్, పరపతి సంఘం అధ్యక్షులు అందె శ్రీనివాస్, నాయకులు గుండు వెంకటేశ్వర్లు, బుద్దె వెంకటేశ్వర్లు, ఎగ్గడి శ్రీనివాస్, బాల్దురి రవి, వనపర్తి లక్ష్మినారాయణ, ఇండ్ల వాసు తదితరులు పాల్గొన్నారు.
--------------------------------------------------------------------------------------------
తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం కార్యవర్గ సమావేశం 29 నవంబర్ 2024న ఖైరతాబాద్ పెరిక హాస్టల్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శ్రీరాం భద్రయ్య, రాష్ట్ర అధ్యక్షుడు మద్దా లింగయ్య, ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్, సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీరాం దయానంద్, భవన నిర్మాణ కమిటీ కో చైర్మన్ చుంచు ఉషన్న, సంఘం కోశాధికారి దొంగరి మనోహర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కీత విజయ్ కుమార్, ప్రచార కార్యదర్శి బంధు శ్రీధర్ బాబు, అధికార ప్రతినిథులు బత్తిని పరమేష్ (హైదరాబాద్ నగర్ అధ్యక్షుడు), సుందరి వీర భాస్కర్ (ఎల్.బి.నగర్ జోన్ అధ్యక్షుడు), నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కుంచాల శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అచ్చ రఘు కుమార్, పెరిక సంఘం యువజన విభాగం గౌరవాధ్యక్షుడు మాడిశెట్టి శ్రీధర్, అధ్యక్షుడు దాసరి ప్రకాశ్, పెరిక హాస్టల్ ప్రధాన కార్యదర్శి దిడ్డి సురేశ్, పెరిక కుల పరస్పర సహకార పరపతి సంఘం అధ్యక్షుడు అందె శ్రీనివాస్, డైరెక్టర్ అంకతి విజయ్ కుమార్, పెరిక కుల సంక్షేమ సమితి కోశాధికారి బోడకుంటి ప్రకాశ్, హైదరాబాద్ నగర అసోసియేట్ అధ్యక్షుడు దొంగరి శంకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో ఈ క్రింది నాలుగు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
*1*. తెలంగాణ రాష్ట్ర పెరిక కుల ఆత్మగౌవర భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వం రెండు ఎకరాల స్థలం, రెండు కోట్ల రూపాయలను మంజూరు చేసింది. సంఘం నాయకులు పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో నాటి బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు పెరిక కులానికి మరో 3 కోట్ల రూపాయలు అదనంగా ఇస్తామని హామీ ఇచ్చారు. జీవో విడుదల చేసినట్లు 2 కోట్లు గానీ, హామీ ఇచ్చిన 3 కోట్లు కాదు కదా ఒక్క పైసా ప్రభుత్వం నుంచి రాలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. తెలంగాణ పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని బిసి సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని సంఘం నాయకులు పలు మార్లు కోరడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవని, ఏ కుల సంఘానికి కూడా నిధులు విడుదల చేసే పరిస్థితి లేదని మంత్రి ప్రభాకర్ గారు చెప్పారు. 2025 మార్చిలో ప్రవేశ పెట్టే బడ్జెట్లో కుల సంఘాలకు నిధులు కేటాయించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అప్పటి వరకు నిధులు ఇవ్వలేమని స్పష్టం చేశారు.
పెరిక కులానికి కేటాయించిన స్థలంలో వేసిన బోర్ కూడా సక్సెస్ అయింది. సాయిల్ టెస్ట్ కూడా జరిగింది. నిర్మాణ పనుల కోసం కరెంటు కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని, విద్యుత్ శాఖ అధికారులను కూడా పలు మార్లు కోరడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఆమోదం రానిదే విద్యుత్ సరఫరా చేసే పరిస్థితి లేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు. మార్చి వరకు ఆత్మ గౌరవ భవనాల విషయం గురించి తామేమీ నిర్ణయం తీసుకోలేమని బిసి మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిధులు వచ్చే దాకా ఎదురు చూడకుండానే కుల పెద్దలు, దాతలు ఇప్పటికే ఇచ్చిన విరాళాలతో పాటు, మరికొన్ని విరాళాలు సేకరించి ఆరు అంతస్తుల భవనం నిర్మించాలని సమావేశంలో తీర్మానించనైనది. ఒక్కో అంతస్తు 12 అడుగుల ఎత్తులో, 50 X100 అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని నిర్ణయించడమైనది. మొదటి అంతస్తు పనులు వెంటనే ప్రారంభించాలని, దీనికోసం టెండర్లు పిలవాలని నిర్ణయించడం జరిగింది. ఈ భవన నిర్మాణం కోసం దాతలు విరివిగా విరాళాలు ఇవ్వాలని సంఘం ఈ సమావేశంలో విజ్ఞప్తి చేసింది.
పెరిక కుల సంఘానికి కేటాయించిన రెండు ఎకరాల స్థలం చుట్టూ ప్రహారీ గోడ నిర్మించాలని గతంలోనే సంఘం నిర్ణయించింది. ఇంజనీర్లు, సంఘంలోని బిల్డర్లు స్థలాన్ని పరిశీలించారు. ఒకవైపు దాదాపు 50 ఫీట్ల ఎత్తులో రోడ్డు, మరోవైపు పెద్ద గుట్ట, మిగతా రెండు ప్రాంతాలు ఎగుడు దిగుడుగా ఉన్నందున అక్కడ ప్రహారీ గోడ నిర్మించడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని తేల్చారు. పెరిక కులానికి కేటాయించిన స్థలం మిగతా కులాలకు కేటాయించిన స్థలాలతో కలిపి ఉంది. ప్రభుత్వమే అక్కడ మొత్తం స్థలాన్ని లెవల్ చేసి ఇవ్వాల్సి ఉంది. కానీ నిధుల లేమి వల్ల ఆ పనులు కావడం లేదని హెచ్ఎండిఏ అధికారులు చెప్పారు. సంఘానికి కేటాయించిన స్థలం ప్రస్తుతానికి ప్రహారీగోడ నిర్మాణానికి అనుగుణంగా లేదు కాబట్టి, మన కులానికి కేటాయించిన స్థలం హద్దులు నిర్ణయించి ఐరన్ తీగలతో బార్బుడ్ ఫెన్సింగ్ వేయాలని తీర్మానించనైనది.
2. సంఘం వర్కింగ్ ప్రసిడెంట్ వలిశెట్టి సత్యనారాయణ చేసిన రాజీనామాను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.
3. వలిశెట్టి సత్యనారాయణతో పాటు, జనగామ జిల్లా అధ్యక్షుడు ముత్తినేని వెంకటరమణ వాట్సాప్ లలో నిరాధార ఆరోపణలతో పోస్టులు పెట్టడాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఖండించింది. సంఘంపైన ఆరోపణలు చేసిన వలిశెట్టి సత్యనారాయణ గారిని, ముత్తినేని వెంకట రమణ గారిని కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని కోరడం జరిగింది. వారు చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపాలని కోరడం జరిగింది. కానీ వారిద్దరూ సమావేశానికి రాలేదు. సమావేశాలు నిర్వహించినప్పుడు వచ్చి తమ అభిప్రాయాలు చెప్పకుండా పనిచేసే వారిపై బురద జల్లే విధంగా వ్యవహరించడం ఏమాత్రం సంస్కారం కాదని వారిద్దరినీ సంఘం నాయకులు తప్పు పట్టారు.
4. ప్రభుత్వ నుంచి ఇప్పటి వరకు భవన నిర్మాణం కోసం ఒక్క పైనా రాలేదు. ఐనా సరే ప్రభుత్వ నిధులు విడుదల చేసినా ఒక్క ఇటుక కూడా పెట్టడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఏది పడితే అది పోస్టులు పెట్టడం మంచి సంప్రదాయం కాదని సంఘం అభిప్రాయపడింది. పెరిక కుల బంధువులకు సంఘం గురించి కానీ, భవన నిర్మాణం గురించి కానీ, ఇంకా ఏదైనా విషయం గురించి కానీ సందేహాలుంటే సమావేశాలు జరిగినప్పుడు ప్రస్తావించి నివృత్తి చేసుకోవాలి తప్ప సంఘం గౌరవం దెబ్బతినేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మంచి పద్దతి కాదని సమావేశం హెచ్చరించింది. భవన నిర్మాణం కోసం జరిగిన విరాళాల సేకరణ, ఖర్చు విషయంలో గత సమావేశంలోనే కూలంకశంగా చర్చించి, ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అయినా కొందరు కావాలని ఆ విషయాన్ని ప్రస్తావించడం దురుద్దేశపూర్వకమే అని సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఎవరు కూడా సంఘానికి వ్యతిరేకంగా నిరాధారమైన ఆరోపణలతో సోషల్ మీడియాకు ఎక్కవద్దని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. అలా చేసిన పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం వివిధ కమిటీల్లో పనిచేస్తున్న పెద్దలంతా తమ స్వంత పనులు వదులుకుని, సంఘం కోసం సమయం కేటాయించి, తమ స్వంతంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని పని చేస్తున్నారు. అలాంటి వారి ఉత్సాహాన్ని, సేవా నిరతిని నిరుత్సాహ పరిచే విధంగా పోస్టులు పెట్టడం ఏమాత్రం నాగరిక లక్షణం కాదని సమావేశం తీవ్రంగా తప్పు పట్టింది.
త్వరలోనే నిర్మాణ పనుల ప్రారంభం
స్థలం వద్ద నీరు పడడంతో హర్షం వ్యక్తం చేస్తున్న కుల బంధువులు.
పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణ స్థలంలో ఈరోజు (18-01-24) వేసిన బోర్ సక్సెస్ అయింది.
750 అడుగుల లోతులో రెండు ఇంచుల మేర నీరు వస్తున్నది. గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పనులు రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి.
బోర్వెల్ సక్సెస్ కావడంతో ఇక కరెంటు సరఫరా పొంది మోటర్ బిగించి నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్మాణ కమిటీ నిర్ణయించింది. నిర్మాణ పనులను పర్యవేక్షించడంతోపాటు కులపర కార్యక్రమాలను కూడా నిర్వహించుకునేందుకు వీలుగా కోకాపేట స్థలంలోనే తాత్కాలిక పెరికకుల సంఘం కార్యాలయం నిర్మించాలని కూడా నిర్ణయించడం జరిగింది.పెరిక కుల ఆత్మగౌరవ భావన కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్, వైస్ చైర్మన్లు చుంచు ఉషన్న, గాండ్ల రాములు, ప్రధాన కార్యదర్శి కుంచాల శ్రీనివాస్ ఈ పనులను పర్యవేక్షించారు.