తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
జై పెరిక
జైజై పెరిక
మనం ఎవలం? అవును.. మనం ఎవలం?
మనల్ని మనం నిజాయితీగా ప్రశ్నించుకుందాం
మనల్ని మనం బేషజాలు విడిచి నిలదీసుకుందాం
మన అంతరాత్మల్ని మనమే స్పటిక సదృశ్యంగా దర్శించుకుందాం
మనం ఎక్కడున్నాం, మన చుట్టూ ఏం జరుగుతుందో సింహావలోకనం చేసుకుందాం
మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి పోవాలనుకుంటున్నామో గజావలోకనం చేసుకుందాం
ఓ పెరిక రక్తమా... లే
ఓ పెరిక స్వేదమా.. రా
ఓ పెరిక ఊపిరీ... పా
చరిత్రలో మనల్ని మనం వెతుక్కుందాం.. నిద్రలే
వర్తమానంలో మనల్ని మనం నిలబెట్టుకుందాం.. కదిలిరా
భవిష్యత్తులో మనల్ని మనం చూసుకుందాం... సాగుదాంపా
బలహీన వర్గాలుగా మద్ద పడ్డ మనం ఎవలం?
నిజంగా బలహీనులమా? మరీ అంత వెనుకబడి పోయామా?
మనం దేబరించి బతికే బానిస జాతి సంతతా?
గుండెబలంతో ముందుకు దుమికే వీరుల వారసత్వమా?
నిచ్చెన మెట్ల భారతీయ సమాజంలో పైమెట్లను వెతుక్కుందాం.
అసమ సమాజంలో మనం సహజ హక్కుల కోసం కలబడదాం.
మానవజాతి పురోగతిలో బలహీన వర్గాలుగా ముద్రపడ్డ శ్రామికశక్తిదే బలమైన ముద్ర
జాతి నిర్మాణంలో రెక్కలు ముక్కలు చేసుకున్న వృత్తి నైపుణ్య దారులదే కీలకమైన పాత్ర
నాగరికతకు బీజాలు వేసిన చక్రం చెక్కింది ఓ వృత్తిదారుడు
ఆకులు కట్టుకుని తిరిగే మనిషికి బట్ట కట్టింది ఓ వృత్తిదారుడు
పచ్చిమాంసం తినే మృగ సంస్కృతి కలిగిన రెండు కాళ్ల జంతువుకు ధాన్యం అందించి, మానవుడిగా మార్చింది ఓ వృత్తిదారుడు
పండించిన ధాన్యాన్ని నిల్వచేసుకోవడానికి బస్తాలు తయారు చేసింది ఓ వృత్తిదారుడు
తిండిలేని చోటకి ఆహార ధాన్యాలను రవాణా చేయడానికి బోరాల నేసింది ఓ వృత్తిదారుడు
అలాంటి వృత్తిదారుల సమూహంలో సమున్నత స్థానంలో నిలిచిన ఓ అద్భుతమైన కులమే మన పెరిక కులం.
పెరిక అనే పదంలోనే వృత్తి నైపుణ్యానికి సంబంధించిన విశ్లేషణ ఉంది.
ఎడ్లు, గుర్రాలు, గాడిదల లాంటి పశువులకు రెండు వైపులా వేలాడదీయడానికి వీలుగా ఉండే గోనె సంచుల జతనే పెరిక అంటారు. ఈ సంచులకు రెండు వైపులా ద్వారాలుంటాయి. ఎక్కువ సరుకును రవాణా చేయడానికి, మోసే వాటికి ఎక్కువ భారం కలగకుండా పెరికలను తయారు చేసిన మెరికల్లాంటి వృత్తి దారులకు కలిగిన కులం మనది.
పశువులకు కూడా భారం కలగకుండా చూసుకునే సున్నిత మనస్కులు మన పెరికలు.
ఒకే పశువు ద్వారా ఎక్కువ సరుకులను రవాణా చేయడానికి మార్గం కనిపెట్టిన దార్శనికులు మన పెరికలు.
ఒకే వాహనంపై పదుల బస్తాల ధాన్యాన్ని రవాణా చేయడానికి బోరాలు తయారు చేసిన ఆలోచనా పరులు మన పెరికలు.
మన పెరికలు పంటను పండించారు. ధాన్యం నిల్వ చేసే గోనె సంచులు తయారు చేశారు. రవాణా చేయడానికి బోరాలు తయారు చేశారు. రవాణా చేయడానికి ఎడ్లు, బండ్లను సమకూర్చుకున్నారు. వచ్చిన ఆదాయాన్ని ఇతర కులాల వారి ఉపాధికి పెట్టుబడిగా ఉపయోగించారు. సమాజంలో అందరికీ సహాయకారిగా నిలిచి తలలో నాలుకలయ్యారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందు నిలిచి సహాయం అందించారు. వస్తువులను రవాణా చేసేందుకు సులువైన మార్గమైన పెరికలను తయారు చేసిన ప్రత్యేక వృత్తిదారుల ప్రస్తావన కాకతీయుల శాసనాల్లో లిఖించబడిన చరిత్ర.
ధాన్యం పండించడంతో పాటుగా, ఎడ్లు, గుర్రాలు, గాడిదలపై ఆహార ధాన్యాలను, ఇతర వస్తువులను రవాణా చేసే వ్యాపార వర్గానికి చెందిన వారు పెరకలు అని 1891లో మొదటి సారి జరిపిన జనాభా లెక్కల్లో మన కులం గురించి రాసిన వాస్తవం.
చరిత్రలో అసలు సిసలు వ్యాపారులు పెరికలు. నేడు బలహీన వర్గాలుగా ఎక్కడో ఒక మూలనున్న కులస్తులే పెరికలు అని సురవరం ప్రతాప రెడ్డి గారు మన గురించి తన రచనల్లో పేర్కొన్నారు.
పెరికలను ఉపయోగించి వ్యాపారం చేసేవారు కాలక్రమంలో ఒక సముదాయంగా ఏర్పడ్డారు. చివరకు అంతర్వివాహాలను మాత్రమే పాటిస్తూ పెరికలనే ప్రత్యేక కులంగా, చాతుర్వర్ణ వ్యవస్థలో మిగతా వృత్తిదారుల మాదిరిగానే చతుర్థ కులంలో ఒకరుగా పరిగణించబడ్డ జాతి మనది. ఫుర్వకాలంలో పెఱికల మీద సరకులు రవాణా చేసి అదే ముఖ్యవృత్తిగా జీవించే తెగలవారికి క్రమేణా "పెఱిక" అన్న పేరు కులనామంగా స్థిరపడింది. రాజ్యవంశాలు చేసే శ్రమదోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన వృత్తిదారులకు నాయకత్వం వహించిన సామాజిక వర్గంగా నిలిచినందున పెరికలను పురాల్లో, గిరుల్లో నివసించే క్షత్రియులు అని కీర్తించబడ్డారు మన పూర్వ పెరికీయులు. అందుకే పెరికలకు పురగిరి క్షత్రియ అనే ప్రసంశాపూర్వక సర్వనామమూ జతయింది.
వ్యవసాయ దారులుగా, వృత్తిదారులుగా, వస్తువులు తయారు చేసే నిపుణులుగా, రవాణా కర్తలుగా, వ్యాపారులుగా, న్యాయం కోసే పోరాడిన క్షత్రియులుగా పెరికలు బహుముఖ పాత్రపోషించినట్ల చారిత్రక ఆధారాలున్నాయి. అందుకే పెరిక కులస్తులను బిసి కులాల్లోనే ఒక చైతన్యవంతమైన వర్గంగా, డైనమిక్ గుణం కలిగిన సమూహంగా, స్పార్క్ కలిగిన జీన్స్ ఉన్న కులంగా పరిగణిస్తున్నారు.
కాలక్రమేణా వచ్చిన అనేక మార్పుల ఫలితంగా నేడు సమాజంలో పెరికల వృత్తి మారింది. ప్రవృత్తి మారింది. జీవితం మారింది. జీవనం మారింది. రాత మారింది. గీత మారింది.
మారిన పరిస్థితులను ఆకళింపు చేసుకుని, అందుకు అనుగుణంగా తన బతుకు దారిని తీర్చిదిద్దుకున్న కులం పెరిక కులం.
కుల వృత్తులు కూలిపోయాయని కృంగపోని జాతి మనది.
మన తలరాత ఇంతే అని అధైర్య పడని రక్తం మనది.
గాలిలో దీపం పెట్టి దేవుడి కోసం ఎదురు చూడని నైజం మనది.
మిన్ను విరిగి మీద పడ్డా వెన్ను చూపని ధైర్యం మనది.
కాలి కింద భూమి కదిలి పోతున్నా చలించని స్థైర్యం మనది.
ఆకలిని జయించి అయినా, ఆత్మగౌరవం కాపాడుకునే ఖ్యాతి మనది.
గోనె సంచులు, బోరాలు కనుమరుగు కావడంతో నిరుత్సాహ పడలేదు.
ఉపాధి పోయందని ఉసూరుమంటూ ఊరికే ఉండలేదు.
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడలేదు.
ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకుని ఏటికి ఎదురీది గెలిచి నిలిచిన జాతి పెరిక జాతి. గోనె సంచులు నేసే చేతులు పుస్తకాలు చేతబట్టాయి. విధి రాతను మార్చి బంగారు బతుకురాత రాసుకున్నాం. చుట్టూ చీకట్లను చూసి తిట్టుకుంటూ కూర్చోలేదు. చిరుదెవ్వెలను వెలిగించుకుని నిశీధిని తరిమికొట్టినం. కాలం పెట్టిన పరీక్షలకు ఎదురొడ్డి నిలిచి, కాలానికే పరీక్ష పెట్టినం.
మనదసలే స్పార్క్ బుర్ర. మన డిఎన్ఏలోనే క్విక్ లెర్నింగ్ లక్షణం ఉంది. దాంతో మన పెరికలను చదువు బాగా అబ్బంది. ఫలితంగా ఇప్పుడు మన పెరిక కులస్తులు అనేక రంగాల్లో అత్యున్నత స్థానాల్లో నిలిచారు.
చదువులమ్మ చల్లని ఒడిలో బతుకు పాఠాలు నేర్చిన మన పెరిక బిడ్డలు... ఉపాధ్యాయులుగా, లెక్చరర్లుగా, ప్రొఫెసర్లుగా, రిజిస్ట్రార్లుగా, విసిలుగా ఎదిగి సమాజ వికాసం కోసం గురుతర బాధ్యత నిర్వర్తిస్తున్నారు.
మండల రిపోర్టర్ నుంచి మొదలుకుని పత్రికలు, టీవీ ఛానళ్లకు ఎడిటర్, మీడియా అకాడమీ చైర్మన్ లాంటి అత్యున్నత హోదాలు అందుకునేంత వరకు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రభుత్వ శాఖలకే ప్రజాసంబంధాల అధికారులు అయ్యేంత వరకు మన పెరిక జర్నలిస్టులు ఎదిగారు.
మన పెరిక బిడ్డల కలం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అందుకునే స్థాయికి ఎగబాకింది.
మెంటల్లీ, ఫిజికల్లీ ఎప్పుడూ ఫిట్ గా ఉండే సహజ లక్షణం కలిగిన మన పెరిక బిడ్డలు... పురగిరి క్షత్రియ నామాన్ని నిజం చేస్తున్నారా అన్నట్లు... కానిస్టేబుళ్లుగా, ఎస్సైలుగా, సిఐలుగా, డిఎస్పీలుగా, ఎస్పీలుగా, డిఐజిలుగా సేవలందిస్తూ సామాజిక భద్రతకు భరోసానిచ్చే నాలుగో సింహాలుగా నిలుస్తున్నారు.
ఆది నుంచి సేవాభావంతో కూడిన వ్యాపారం చేసే లక్షణాలు కలిగిన మన పెరిక బిడ్డలు నేడు అనేక రకాల వ్యాపారాల్లో స్థిరబడి తాము బతుకుతూ, పది మందికి బతుకు దెరువు చూపించే గొప్ప భూమిక నిర్వహిస్తున్నారు.
ఇప్పుడు మన పెరిక జాతిలో వందలాది మంది డాక్టర్లున్నారు. వందలాది మంది ఇంజనీర్లున్నారు. వందలాది మంది ప్రభుత్వాధికారులున్నారు. ఇవాళ హైదరాబాద్ నగరంలో పెరిక డాక్టర్ లేని పెద్దాసుపత్రి, పెరిక ఇంజనీర్ లేని కన్ స్ట్రక్షన్ కంపెనీ, పెరిక అధికారి లేని ప్రభుత్వ కార్యాలయం, పెరిక పోలీస్ లేని పోలీస్ స్టేషన్ లేదంటే అతిశయోక్తి కాదు.
నిర్మాణ రంగంలో అయితే మన పెరిక బిడ్డలు మరెవరికీ తీసిపోనంతగా ఎదిగి, మన పెరిక ఖ్యాతిని ఆకాశానికి విస్తరింప చేస్తున్నారు.
రాజకీయ రంగంలోనూ ఆశించినంత మేర మన ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ, మెరికల్లాంటి పెరికలు విస్తృత ప్రజామోదంతో ప్రజానాయకులుగా ప్రస్థానం సాగిస్తున్నారు. రాజ్యసభకు డిప్యూటీ మేయర్ కాగలిగినంత వరకు మనం రాజకీయంగా ఎదిగాం. ప్రభుత్వ చీఫ్ విప్, విప్, కార్పొరేషన్ చైర్మన్ల లాంటి పదువులు దక్కించుకోగలిగాం. స్థానిక సంస్థల్లోనయితే మన ఉనికిని మాత్రమే కాదు, మన ప్రభవాన్ని కూడా చూపగలుగుతున్నాం. ఉన్నత చదువులు చదువుకుని ఖండాంతరాలలో కూడా మన జాతి ఖ్యాతిని నిలబెడుతున్నాం.
ఇవాళ పెరిక బిడ్డలు సాధించిన పురోగతిని చూసి యావత్ జాతి గర్వ పడుతున్నది. భవిష్యత్తుపై నిండు విశ్వాసంతో ఉన్నది.
సాధించిన దానికి సంతృప్తి చెందకుండా, మరింత ఉన్నత శిఖరాలు అందుకోవడానికి పెరిక బిడ్డలు అహర్నిషలు కృషి చేస్తూనే ఉన్నారు. అలాంటి వారికి మన పెరిక కుల సంఘం కూడా పూర్తి భరోసాగా నిలుస్తున్నది.
పెరిక జాతి జౌన్నత్యానికి, పెరిక జాతి పునర్నిర్మాణానికి, పెరిక జాతి ఐక్యతకు, పెరిక జాతి పురోగతికి తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం వెన్నుదన్నుగా నిలుస్తున్నది. రాష్ట్ర పెరిక సంఘం ఆధ్వర్యంలో, సహకారంతో నడుస్తున్న అనుబంధ సంస్థలు పెరిక బిడ్డలకు అండగా ఉంటున్నాయి.
దాదాపు 50 ఏళ్ల క్రితం మన పెరిక పెద్దలు స్థాపించిన ఖైరతాబాద్ పెరిక హాస్టల్ మన పెరిక జాతి ఆత్మగౌరవానికి, గుర్తింపుకు ఒక ఐకానిక్ గా నిలిచింది. 12 మంది పెద్దలు పూనుకుని స్థాపించిన పెరిక విద్యార్థి వసతి గృహం వేలాది మందికి ఆశ్రయం ఇచ్చి, అన్నం పెట్టి, గొప్ప పౌరులుగా తీర్చిదిద్దింది. 12 మంది వ్యవస్థాపకుల దూరదృష్టిని, సేవా దృక్పథాన్ని పెరిక జాతి ఎన్నటికీ మర్చిపోదు. దాదాపు 400 మందికి పైగా పెరిక పెద్దలు నేడు ట్రస్టీలుగా ఉండి పెరిక విద్యార్థి వసతి గృహాన్ని విజయవంతంగా నడపిస్తున్నారు.
పదేళ్ల క్రితం స్థాపించిన పెరిక కుల పరపతి సంఘం నేడు 1100కు పైగా సభ్యులతో పెరిక బిడ్డల ఆర్థిక అవసరాలు తీరుస్తున్నది. విద్య, వైద్యం, వివాహం లాంటి అవసరాలకు కేవలం ఒక రూపాయి వడ్డీతోనే రుణాలు అందిస్తున్నది.
సేవాభావం, దాతృత్వ గుణం కలిగిన 20 మంది దాతలు తలా ఒక 5 లక్షల రూపాయలు వాటాగా వేసుకుని, కోటి రూపాయల మూల ధనంతో పెరిక కుల సేవా సమితిని స్థాపించి ఆపదలో ఉన్న వారిని ఎప్పటికప్పుడు ఆదుకోవడం జరుగుతున్నది.
తెలంగాణ రాష్ట్ర పెరిక కుల వివాహ వేదిక ఆధ్వర్యంలో నేటి వరకు 23 పరిచయ వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదిక ద్వారా 4,500 పై చిలుకు వివాహాలు జరిపించడం జరిగింది.
పెరిక జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా, పెరిక కులస్థుల పురోగతికి వేదికగా కోకాపేటలోని రెండు ఎకరాల స్థలంలో అత్యద్భుత పెరిక కుల ఆత్మగౌరవ నిర్మాణం జరుగుతున్నది. రాబోయే వందేళ్ల వరకు బావి తరాలను తీర్చిదిద్దడానికి, పెరిక కులస్థుల వికాసానికి ఈ ఆత్మగౌరవ భవనం వేదిక కాబోతున్నది. సేవా తత్పరత, కార్యదక్షత కలిగిన మెరికల్లాంటి పెరికల ఆధ్వర్యంలో ఏర్పడ్డ ఆత్మగౌరవ భవన కమిటి ఆధ్వర్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది పెరిక కులస్తుల విరాశాలు, కృషితో నిర్మితమయ్యే ఈ ఆత్మగౌరవ భవనం పెరిక జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ఓ ఆశాదీపం. అందుకే పెరిక కులస్తులంతా ఈ భవన నిర్మాణంలో పాలు పంచుకోవాలని, ఇతోధికంగా సహకారం అందించాలని ప్రార్థిస్తున్నాం.
పెరిక జాతి ఇంకా ముందుకు పోవాలి. తాను నడుస్తూ తన తోటి బలహీన వర్గాలను కలుపుకుపోవాలనే విశాల దృక్పథంతో, స్పష్టమైన ఆలోచనతో పెరిక జాతి ప్రస్థానం నడుస్తున్నది. తాను బతుకుతూ, పది మందిని బతికించాలనేదే పెరిక జాతి మూల సూత్రం. కదిలీ కదిలించాలి.. కఠిన శిలలనూ కరిగించాలి. కరిగీ వెలిగించాలి.. కోటి కాంతులను వెదజల్లాలి. అదే పెరిక కులస్తుల జీవన సూత్రం.
జై పెరిక
జైజై పెరిక
రచయిత : డాక్టర్ గటిక విజయ్ కుమార్