తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
అధ్యక్షులు
గౌరవ అధ్యక్షులు
ప్రధాన కార్యదర్శి
కార్యనిర్వాహక కార్యదర్శి
కోశాధికారి
రాష్ట్రంలో మరే కులము చేయని విధంగా తెలంగాణలో పెరిక కుల సంఘం ఆధ్వర్యంలో 10 ప్రత్యేక కార్యక్రమాలు అమలు అవుతున్నాయని రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ అన్నారు. పెరిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు తోటి కులస్తులకు ఎంతో ఉపయోగపడడంతో పాటు మిగతా కులాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయని వివరించారు. వరంగల్ లోని ఎంకే కన్వెన్షన్ లో 2025 డిసెంబర్ 7న జరిగిన వరంగల్ జిల్లా పెరిక సంఘం సర్వసభ్య సమావేశంలో విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పెరిక కుల సంఘం అధికారిక వెబ్ సైట్ ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో విజయ్ కుమార్ మాట్లాడుతూ కుల సంఘాల అంతిమ లక్ష్యం సామాజిక మార్పు, పేదరిక నిర్మూలన అయి ఉండాలని సూచించారు. కుల సంఘం కోసం పనిచేయడం అంటే ఎవరి ఇంటిని వారు చక్కదిద్దుకోవడమే అని చెప్పారు. ప్రతి కులంలోని పెద్దలు ఆ కులాభివృద్ధికి కృషి చేస్తే అంతిమంగా సమాజంలోని అన్ని సామాజిక వర్గాలు పురోగమిస్తాయని అభివర్ణించారు.
పెరిక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న 10 ప్రత్యేక కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.
కోకాపేటలో రెండు ఎకరాల స్థలంలో తెలంగాణ పెరికకుల ఆత్మగౌరవ భవనం నిర్మాణం అవుతున్నదని, రాష్ట్రంలో మరే కుల సంఘం కూడా ఇప్పటివరకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో భవనం నిర్మించుకోలేదని, ఆ ఘనత పిరకకుల సంఘానికి దక్కుతున్నదని చెప్పారు. ఎల్బీనగర్ ప్రాంతంలో బాలికల కోసం ప్రత్యేక వసతిగృహం నిర్మిస్తున్నామని, పెరికకుల పరపతి సంఘం ఆధ్వర్యంలో నాలుగు కోట్ల రూపాయల టర్నోవర్తో ఆర్థిక సహాయ కార్యక్రమాలు అందిస్తున్నామని, పెరిక సంక్షేమ సమితి ద్వారా కోటి రూపాయల నిధితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, 35 అనుబంధ సంఘాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి పెరిక బిడ్డ ఆలనా పాలనా చూసే ప్రక్రియ ప్రారంభం అయిందని, పెరిక కుల కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఒక వెబ్సైట్ నిర్వహిస్తున్నామని, పెరిక కులం తరఫున ఒక పేపర్, ఒక న్యూస్ ఛానల్ కూడా నడుపుతున్నామని, పెరిక కుల వివాహ వేదిక తరపున ఇప్పటికీ 28 శిబిరాల నిర్వహించి 6000 ఉచిత పెళ్లిళ్లు నిర్వహించినట్లు విజయ్ కుమార్ వివరించారు. రాష్ట్రంలోని ప్రతి పెరిక కులస్తుడి వివరాలు తెలుసుకునేందుకు అన్ని జిల్లాల్లో సమగ్ర పెరిక కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు వివరించారు. పెరిక కుల సంఘం తరఫున రాష్ట్రంలోని పెరిక కులస్తులందరికీ ఉచిత న్యాయ సహాయం, ఉచిత వైద్య సహాయం అందించే కార్యక్రమం కొనసాగుతున్నదని, అదేవిధంగా త్వరలోనే పెరిక కులస్తులందరికీ ఉచిత విద్య అందించే విధంగా ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.
రాష్ట్రంలో మరే కుల సంఘం కూడా ఇన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించడం లేదని, మిగతా కులాలకు తెలంగాణలో పెరిక కులం ఆదర్శంగా నిలుస్తున్నదని సంతోషం వ్యక్తం చేశారు.
వరంగల్ జిల్లా పెరికకుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షునిగా సీనియర్ జర్నలిస్టు అల్లం రాజేష్ వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సమావేశంలో పెరిక కుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మద్దాలింగయ్య , మాజీ అధ్యక్షులు శ్రీరామ్ దయానంద్ , పెరిక హాస్టల్ అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, పరపతి సంఘం అధ్యక్షులు అందే శ్రీనివాస్, నాయకులు చుంచు ఉషన్న, సుంకరి ఆనంద్, దొంగరి మనోహర్, సందెల లింగం, కుంచాల శ్రీనివాస్, అంకతి విజయ్ కుమార్ , బల్దూరి రవికుమార్, మైళారు శెట్టి చైతన్య, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గాన్ల చంద్రశేఖర్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గజ్వేల్ సత్యనారాయణ, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు సూరం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాకు చెందిన పెరిక సంఘం నాయకులు 2025 డిసెంబర్ 5న హన్మకొండలో రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారిని కలిశారు. పెరిక సంఘం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలపై చర్చించారు. 2025 డిసెంబర్ 7న వరంగల్ ఎంకె నాయుడు కన్వెన్షన్ లో జరిగే జిల్లా పెరిక సంఘం సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. పెరిక కుల సంఘం అధికారిక వెబ్ సైట్ ప్రారంభించాలని కోరారు. దీనికి మంత్రి సురేఖ గారు సమ్మతించారు. తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కీత విజయకుమార్ , పెరిక ధాత్రి ఎడిటర్ బరుపటి సంపత్ కుమార్, పెరిక కుల నాయకులు అల్లం రాజేష్ వర్మ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెరకకుల పెద్దలు వనపర్తి శ్రీనివాస్ , పెరిక కుల వరంగల్ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు బెడద వీరన్న, ఎసిరెడ్డి ప్రభాకర్ , అంకతి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.