తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
అధ్యక్షుడు
ప్రధాన కార్యదర్శి
తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం (766/2014) అనుబంధ మహబూబాబాద్ జిల్లా పెరిక కుల సంఘం సర్వసభ్య సమావేశం 2026 జూలై 26న తొర్రూరులోని సిద్ధార్థ హైస్కూల్లో ఘనంగా జరిగింది. మహబూబాబాద్ జిల్లా కో ఆర్డినేటర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గటిక విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కీత విజయ్ కుమార్, పెద్ద వంగర్ సర్పంచ్ ముద్దసాని పారిజాతం సురేశ్, గంట్లకుంట ముత్తినేని సోమన్న, తొర్రూరు మున్సిపల్ కౌన్సిలర్ ముద్దసాని సురేశ్, వరంగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు సూరం రవీందర్, హన్మకొండ జిల్లా గౌరవ అధ్యక్షుడు సోమిశెట్టి శ్రీనివాస్, మాజీ జడ్పీటిసి శ్రీరాం సుధీర్, రాష్ట్ర నాయకులు గోపు చరణ్, ముద్దసాని మధుకర్, జిల్లా నాయకులు బాదె సైదులు, అవిరె మోహన్ రావు, కానుగంటి సత్యనారాయణ, బెడద వీరన్న, పెరికనాడు ఎడిటర్ కానుగంటి వీరన్న తదితరులు పాల్గొన్నారు.
సర్వసభ్య సమావేశంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా పెరిక కుల సంఘం నూతన కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ప్రతినిధులు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా పెద్ద వంగర గ్రామ సర్పంచ్ కందమళ్ల భరత్ బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా కురవి మండలానికి చెందిన బాదె శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అన్ని మండలాల ప్రతినిథులతో త్వరలోనే జిల్లా స్థాయి పూర్తి కార్యవర్గం ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
పెరిక కులం అగ్రగామిగా నిలుస్తోంది: గటిక విజయ్ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో పెరిక కులం అన్ని విషయాల్లో అగ్రగామిగా నిలుస్తోందని, ఇతర కులాలకు ఆదర్శంగా నిలబడిందని పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గటిక విజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని కులాలకు ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో స్థలం కేటాయించినప్పటికీ, కేవలం పెరిక కులస్తులం మాత్రమే స్వంతంగా కోకాపేటలో ఆత్మగౌరవ భవన నిర్మాణం చేపట్టడం గర్వకారణమన్నారు. పెరిక కులానికి చెందిన అనేక మంది దాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తున్నారని, ఇది కులంలోని ఐక్యతకు, సేవాభావానికి నిదర్శనమన్నారు. 51 ఏళ్లుగా పెరిక కులం మాత్రమే నిరాటంకంగా పెరిక హాస్టల్ నిర్వహిస్తున్నదని, రాష్ట్రంలో మరెవరూ చేయని విధంగా బాలికల కోసం ప్రత్యేక హాస్టల్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఎల్.బి.నగర్ లో బాలికల హాస్టల్ ప్రారంభమవుతుందని చెప్పారు. పెరిక విద్యాజ్యోత కార్యక్రమం ద్వారా గ్రూప్స్, సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత వసతి,భోజనం, ట్యూషన్ ఫీజు చెల్లించనున్నట్లు వెల్లడించారు. నాలుగు కోట్ల టర్నోవర్ తో నడుస్తున్న పెరిక కుల పరపతి సంఘం సంఘీయుల ఆర్థిక అవసరాలు తీరుస్తున్నదని ప్రకటించారు. పెరిక కులానికి చెందిన 20 మంది దాతలు తలా ఒక ఐదు లక్షల రూపాయలు చందాగా ఇచ్చి కోటి రూపాయల మూలనిధితో పెరిక సంక్షేమ సమితి నిర్వహిస్తున్నారని, దీనివల్ల ఎంతో మంది ఆపదలో ఉన్న పెరిక బిడ్డలను ఆదుకోవడం సాధ్యమవుతున్నదని వెల్లడించారు. పెరిక వివాహ వేదిక ద్వారా ఇప్పటికే దాదాపు 7 వేల పెళ్లిళ్లు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో మరే కుల సంఘంలో లేని విధంగా పెరిక కులానికి 35 అనుబంధ సంఘాలు చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 28 జిల్లాల్లో పెరిక కులస్తులుంటే, ఇప్పటికే 26 జిల్లాల్లో ఎన్నికలు పూర్తి చేసుకున్నామని, వచ్చే ఆదివారం మిగిలిని రెండు జిల్లాల ఎన్నికలతో మొత్తం అన్ని జిల్లాల ఎన్నికలు పూర్తవుతాయని వెల్లడించారు.
తొర్రూరులో పెరిక భవన్ నిర్మాణానికి ప్రణాళిక
తొర్రూరు డివిజన్ కేంద్రంలో పెరిక భవన్ నిర్మించే విషయంపై ఈ సమావేశంలో చర్చించారు. తొర్రురుకు చెందిన ముద్దసాని వెంకటేశ్వర్లు తన స్వంత స్థలం 200 గజాలు తన తల్లిదండ్రుల పేరిట పెరిక భవన్ నిర్మాణానికి ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూణం శ్రవన్, కౌన్సిలర్ ముద్దసాని సురేశ్, జిల్లా అద్యక్షుడు భరత్ బాబు తదితరుల ఆధ్వర్యంలో త్వరలోనే నిర్మాణ కార్యక్రమం చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
యువ నాయకులకు ఘన సన్మానం చేసిన రాష్ట్ర సంఘం ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్ బాబు
తొర్రూర్ మున్సిపాలిటీలో మన పెరిక కులానికి చెందిన యువ నాయకులు తునం శ్రవణ్ గారు మున్సిపల్ చైర్మన్గా, ముద్దసాని సురేష్ గారు కౌన్సిలర్ గా విజయం సాధించి మన కుల సమాజ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. వీరు ఇరువురికి ఈరోజు శుక్రవారం సూర్యాపేట పెరిక కుల సంఘం అధ్యక్షుడు బందు శ్రీధర్ బాబు ఘన సన్మానం చేశారు.
తునం శ్రవణ్, ముద్దసాని సురేష్ లతో రాష్ట్ర సంఘం అధ్యక్షులు ఘటిక విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షుడు మద్ద లింగయ్య గారు మాట్లాడి శుభాకాంక్షలు తెలిపి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాద్ జిల్లా పెరిక కుల సంఘం మాజీ అధ్యక్షులు, పెద్దముప్పారం గ్రామ సర్పంచ్ కందిమల్ల భరత్ బాబు, మహబూబాబాద్ జిల్లా సంఘం నాయకులు సందెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.